గుంట గలగర ఉపయోగాలు

గుంటకలగర లేదా గుంటగలగర ఒక విధమైన ఔషధ మొక్క. ఇది ఆస్టరేసి (Asteraceae) కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం ఎక్లిప్టా ఆల్బా (Eclipta alba). నీటి కాలువలు, గుంటల పక్కన, తేమగల ప్రదేశాలలో నేలబారుగా పెరిగే కలుపు మొక్క గుంటగలిజేరు. గుత్తులుగా ఉన్న తెల్లని చిన్న పూలను పూస్తుంది. సంస్కృతంలో దీన్ని భృంగరాజ అంటారు. మార్కెట్లో చాలా తల నూనెలు గుంటగలగర ఆకులతో తయారు చేస్తున్నారు. వెండ్రుకలు రాలిపోకుండా కాపాడే గుణం దీనిలో ఉండటమే అందుకు కారణం. గుంటగలగర మొక్కలను వేళ్లతో సహా తీసి శుభ్రపరచి నీడలో ఎండబెట్టాలి. దీనికి మార్కెట్లో మంచి అమ్మకపు విలువ వుంటుంది. ఆధునిక పరిశోధనలలో ఇందులో కల ఎక్లిప్టిన్ అనే ఔషధతత్వానికి లివర్ ను బాగుచేయగల శక్తి ఉందని కనుగొన్నారు. ఆయుర్వేద వైద్య విధానంలో గుంటగలిజేరును ప్రధానంగా తల వెండ్రుకలు నల్లగా, వత్తుగా పెరగటానికి, లివరు, చర్మ వ్యాధులలో వాడుతారు.

ఇది ఉబ్బసము, బ్రాంకైటిస్, రుమాటిజమ్ నివారణలో, రక్తస్రావాన్ని అరికట్టడంలో, వెంట్రుకల పెరుగుదలకు వాడే మందుల్లో ఉపయోస్తారు.

పేను కొరుకుడు : తలపైన అక్కడక్కడ ఒక్కమారుగా వెండ్రుకలు రాలిపోయి మచ్చలు మచ్చలుగా అగుపించే దానిని సామాన్యంగా పేనుకొరుకుడు అంటారు. గుంట గలిజేరు మొక్కను వేరుతో సహా సేకరించి మెత్తటి ముద్ద అయ్యేట్లు నూరి పేనుకొరుకుడు గల ప్రదేశాల్లో పూయాలి. ఈ విధంగా ఒక వారం రోజులు చేస్తే వెండ్రుకలు రాలటం ఆగి పోయి కొత్త వెండ్రుకలు వస్తాయి.
చిన్న పిల్లల్లో దగ్గు : గుంటగలిజేరు ఆకులను నీటితో శుభ్రంగా కడిగి దంచి రసం తీయాలి. రెండు చుక్కల రసాన్ని ఒక టీ స్పూన్ (5 మి.లీ) తేనెలో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే దగ్గు ఉపశమిస్తుంది. గొంతులో గరగర తగ్గిపోతుంది.



వెండ్రుకలు నల్లబారుట : గుంట గలిజేరు మొక్కను వేరుతో సహా మెత్తగా దంచి ముద్ద చేయాలి. దానికి నాలుగు రెట్లు నువ్వులనూనె లేక కొబ్బరినూనె కలిపి సన్నటి సెగపై మరిగించాలి. ఆ మిశ్రమంలోని తేమ ఇగిరిపోయాక నూనెను వడపోయాలి. ఈ గుంటగలగర నూనెను వరుసగా తలకు వాడితే చిన్న వయస్సులో నెరిసిన జుట్టు నల్లబడుతుంది. వెండ్రుకలు రాలిపోవడం ఆగి, కళ్లకు బలం కలుగుతుంది.
పురుగుకాట్లు : చిన్నచిన్న పురుగులు కరిచి అక్కడ దద్దు, వాపు, దురద రావచ్చు. గుంట గలిజేరు ఆకు రసాన్ని కరిచిన చోట పూస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
నోరు పూయుట : నోరు పొక్కి, కురుపులు ఏర్పడినప్పుడు పులుపు, కారం, ఉప్పు తినటం కష్టమవుతుంది. నాలుగు గుంట గలిజేరు ఆకులను శుభ్రంగా కడిగి నోటిలో ఉంచుకొని చప్పరిస్తే నోటిలో కురుపులు త్వరగా మానిపోతాయి.
Share:

Labels